Sri Lanka: శబరిమలలో మరో కలకలం.. అయ్యప్పను దర్శించుకున్న శ్రీలంక మహిళ

  • అయ్యప్ప గర్భగుడిలోకి వెళ్లిన శ్రీలంక మహిళ
  • గురువారం రాత్రి 18 మెట్లు ఎక్కి స్వామి గర్భగుడిలోకి
  • ఆ వార్తలు అవాస్తవమన్న మహిళ

అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ గొడవ సద్దుమణగకముందే ఇప్పుడు మరో కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ గురువారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిందన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుండగా ఆమె మాత్రం తాను వెళ్లలేదని చెబుతుండడం గమనార్హం.

అశోక్ కుమరన్ కుమార్తె శశికళగా ఆమెను గుర్తించారు. 3 డిసెంబరు, 1972లో జన్మించిన ఆమె గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నట్టు చెబుతున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులతో కలిసి ఆమె అయ్యప్పను దర్శించుకున్నారు. అనంతరం ఎటువంటి గందరగోళం లేకుండా పంబకు చేరుకున్నట్టు చెబుతున్నారు. జాతీయ పత్రిక ‘ది హిందూ’ కథనం ప్రకారం.. శశికళ పరమ పవిత్రమైన 18 మెట్లను ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేశారు.

అయితే, తాను స్వామిని దర్శించుకున్నట్టు వస్తున్న వార్తలను శశికళ ఖండించారు. తానో భక్తురాలినని, 48 రోజుల దీక్షలో ఉన్నానని పేర్కొన్నారు. తనను వెనక్కి పంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వివిధ కారణాల వల్ల తన గర్భసంచిని తొలగించారని, కాబట్టి అయ్యప్పను దర్శించుకునే హక్కు తనకు ఉందని వివరించారు. అందుకు సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రం కూడా తన వద్ద ఉందన్నారు. కాగా, ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. శశికళ అయ్యప్పను దర్శించుకునే ఉంటారని, అయితే ఆ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు.

More Telugu News