Andhra Pradesh: టీడీపీ నేతల్లారా.. దమ్ముంటే ఈ నెల 18న అమిత్ షాను అడ్డుకోండి!: విష్ణువర్ధన్ రెడ్డి సవాల్

  • అగ్రిగోల్డ్ ఆస్తులపై టీడీపీ మంత్రుల కన్ను
  • నటుడు శివాజీ టీడీపీకి రాజకీయ బ్రోకర్
  • సీబీఐని ఎందుకు అడ్డుకుంటున్నారు?

దేశంలో ఎక్కడా జరగని రీతిలో అగ్రిగోల్డ్ కుంభకోణం ఏపీలో చోటుచేసుకుందని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రులు ప్రయత్నించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో అసలు అవినీతే జరగకుంటే సీబీఐని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు.

సినీనటుడు శివాజీ టీడీపీ ముసుగు ధరించిన రాజకీయ బ్రోకర్ అని ఆయన విమర్శించారు. బీజేపీతో కలిసేందుకు టీడీపీ నేతలు ఢిల్లీలోని తమ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఆరో విడత జన్మభూమి కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని ఆరోపించారు.

గతంలో ఇచ్చిన అర్జీలు ఇంకా పరిష్కారం కాకుండా కలెక్టర్ల కార్యాలయాల్లో పడి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ నెల 18న బీజేపీ చీఫ్ అమిత్ షా రాయలసీమలో అడుగుపెడతారనీ, దమ్ముంటే టీడీపీ నేతలు ఆయన్ను అడ్డుకోవాలని సవాలు విసిరారు.

More Telugu News