prabhas: ప్రభాస్ ను కబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందన!

  • కబ్జాదారుడన్న వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం
  • సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వకుండా.. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్న కోర్టు
  • రియల్ లైఫ్ లో విలన్లు ఎలా ఉంటారో బాహుబలికి తెలిసి ఉండకపోవచ్చంటూ వ్యాఖ్య

సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని రాయదుర్గంలో ఈ గెస్ట్ హౌస్ ఉంది. ఈ అంశంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈరోజు ప్రభాస్ పిటిషన్ విచారణ సందర్భంగా, ప్రభాస్ భూకబ్జాదారుడంటూ ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ ఎవరైనా భూమిని కబ్జా చేస్తే సెక్షన్ 17 కింద నోటీసులు ఇచ్చి, విచారణ జరపాలని... అది చేయకుండా భూకబ్జాదారుడంటూ వ్యాఖ్యానించడం సరికాదని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ లాయర్ వాదిస్తూ, ప్రభాస్ కు అనుకూలంగా తీర్పును వెలువరిస్తే... అక్కడి భూమిని కబ్జా చేసిన ఇతరులు కూడా అర్హులవుతారని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ తరపు లాయర్ వాదిస్తూ, ఆ భూమిని ప్రభాస్ కొనుగోలు చేశారని, కొనుక్కున్న భూమిలోనే గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

మరోవైపు, విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలికి... రియల్ లైఫ్ లో విలన్లు ఎలా ఉంటారో తెలియకపోయి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చేవారమని... ప్రభాస్ సెలబ్రిటీ కావడంతో అతని విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించామని చెప్పింది. 

More Telugu News