SABARIMALA: శబరిమలలో మహిళల ప్రవేశం ఎఫెక్ట్.. తమిళనాడులో కేరళ హోటల్ పై రాళ్లదాడి!

  • చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఘటన
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
  • ఆస్తుల భద్రత కోసం 100 మంది పోలీసుల మోహరింపు

శబరిమలలో ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలతో తమిళనాడులోని కేరళ పర్యాటక శాఖకు చెందిన ఓ హోటల్ పై దుండగులు దాడిచేశారు. నిన్న రాత్రి 10.40 గంటల ప్రాంతంలో థౌజండ్‌ లైట్స్ ప్రాంతం‌లోని గ్రీమ్స్‌ రోడ్డులో గల హోటల్‌పై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలతో పాటు సెక్యూరిటీ పోస్ట్ ధ్వంసమైంది.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. శబరిమల ఘటన నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడులోని కేరళ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం 100 మంది అదనపు పోలీసులను నియమించామని అన్నారు. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు, సంఘాలు ఆందోళనకు దిగాయి. శబరిమలకు వెళుతున్న రుతుస్రావ వయసు ఉన్న పలువురు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

More Telugu News