Andhra Pradesh: కుప్పం ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తోంది.. కానీ!: సీఎం చంద్రబాబు

  • కుప్పం ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన
  • ఉద్యానవన హబ్ గా మార్చామని వెల్లడి
  • ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చామని వ్యాఖ్య

కుప్పం ప్రాంతాన్ని ఉద్యానవన పంటలకు హబ్ గా మారుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం కోసం తాను ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చానని తెలిపారు. దీనివల్ల రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ పద్ధతిలో తక్కువ ఎరువు, నీటితో మంచి దిగుబడి వస్తోందన్నారు. అలాగే ప్రకృతి సేద్యాన్ని కూడా ఏపీ పాటిస్తోందని అన్నారు. కుప్పంలో ఈరోజు విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వ్యవసాయంతో పాటు గొర్రెలు, కోళ్లతో పాటు డెయిరీపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

కుప్పం ప్రజలు చాలా మంచివారనీ, నీతి-నిజాయతీగా ఉంటారనీ, మంచి పని చేస్తే గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. నాగరికతకు మారుపేరు విమానాశ్రయమని అన్నారు.  కుప్పంతో పాటు త్వరలోనే నెల్లూరు, కర్నూలులలో ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కుప్పం ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తోందనీ, అయితే తనకు గుంటూరులో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం ఉందని అన్నారు.

త్వరలోనే కుప్పం ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుందని జోస్యం చెప్పారు. ఇక్కడి యువత వలసపోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఇక్కడి యువతే కాకుండా బయటి ప్రాంతాలకు చెందిన యువతీయువకులు సైతం ఇక్కడకు వచ్చి పనిచేసుకునేలా కుప్పం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

More Telugu News