Undavalli: ఇప్పుడు మిస్ అయితే.. జగన్ ఇంకెప్పుడూ గెలవలేరు!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • తండ్రి బిజూపట్నాయక్ వల్లే నవీన్ పట్నాయక్ గెలుస్తున్నారు
  • హరికృష్ణ ఎంటర్ కావడంతో, లక్ష్మీపార్వతి కనుమరుగయ్యారు
  • వైయస్ కుమారుడిగా జగన్ కు మంచి అవకాశం వచ్చింది.. పాడు చేసుకున్నారు

వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలవలేక పోతే... భవిష్యత్తులో మరెప్పుడూ ఆయన ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. ఇప్పటికే ఒకసారి ఆయన మంచి అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. భారతదేశంలో వారసత్వ రాజకీయాలదే హవా అని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వాస్తవానికి ఏమీ చేయరని... తన తండ్రి వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. తన తండ్రి బిజూ పట్నాయక్ ను చూపించి గెలుస్తూ ఉంటారని... ఎప్పటికీ ఒడిశాలో ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆయన మంచితనం కూడా ఆయనను కాపాడుతూ వస్తోందని తెలిపారు.

లక్ష్మీపార్వతి విషయంలో కూడా ఇదే జరిగిందని ఉండవల్లి చెప్పారు. తన జీవితంలో సర్వస్వం లక్ష్మీపార్వతే అని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారని... అప్పట్లో ఆమె హవా కూడా అదే స్థాయిలో కొనసాగిందని గుర్తు చేశారు. అయితే, అదే ఊపును ఆమె కొనసాగించలేకపోయారని... ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఎంటర్ కావడంతో... లక్ష్మీపార్వతి కనుమరుగయ్యారని చెప్పారు. రాజకీయాల్లో వారసుడికి ఉండే విలువ ఇదేనని అన్నారు.

వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జగన్ కు బ్రహ్మాండమైన అవకాశం వచ్చిందని... ఆ అవకాశాన్ని గత ఎన్నికల్లోనే జగన్ పాడు చేసుకున్నారని ఉండవల్లి చెప్పారు. ఈసారి ఏం చేస్తారో చూద్దామని తెలిపారు. వాస్తవం చెప్పాలంటే... ఈసారి జగన్ గెలవకపోతే, భవిష్యత్తులో మరెప్పుడూ గెలవలేరని, ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు.

జనసేన గురించి పవన్ కల్యాణే చెప్పాలని... జనసేన పార్టీ అంటే ఆయనే అని ఉండవల్లి అన్నారు. అతని పార్టీకి పడే ప్రతి ఓటు... అతని ముఖాన్ని చూసే పడుతుందని చెప్పారు. పక్కనున్న వాళ్ల వల్ల జనసేనకు ప్రత్యేకంగా పడే ఓటు ఉండదని తెలిపారు.

More Telugu News