Supreme Court: సహజీవనంలో ప్రేమపూర్వక శృంగారం రేప్‌ కాదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • బాధితురాలు ఇష్టపడి చేస్తే అంగీకరించినట్టే
  • నిందితుడు దురుద్దేశపూర్వకంగానే మోసం చేశాడా అన్నది గమనించాలి
  • కోరిక తీర్చుకునేందుకు తప్పుడు మార్గం ఎంచుకున్నాడా అన్నది చూడాలి

సహజీవనం చేస్తున్న మహిళ ప్రేమ పూర్వకంగానే ఓ వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే దాన్ని రేప్‌గా పరిగణించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇటువంటి సందర్భాల్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తే కోర్టు చాలా జాగ్రత్తగా ఆచితూచి కేసును పరిశీలించాలని సూచించింది.

మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు డాక్టర్‌పై వేసిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. సహజీవనం చేస్తున్న పురుషుడు తప్పనిసరి పరిస్థితుల్లో భాగస్వామిని వివాహ మాడనంత మాత్రాన అప్పటి వరకు వారి మధ్య ఉన్న సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేమని స్పష్టం చేస్తూ జస్టిస్‌ ఏ.కె.సిక్రి, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రేప్‌కు, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. భర్త చనిపోయిన తరువాత ఆ నర్సు కొన్నాళ్లుగా ఆ డాక్టర్‌తో ప్రేమలోపడి అతనితో సహజీవనం చేస్తోందని, వారిమధ్య ఇష్టపూర్వక శృంగారం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది.

 ఇటువంటి కేసుల్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే, నిందితుని మాయలో ఆమె పడిపోయిందని కాకుండా, ఆ వ్యక్తి నిజంగా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేక కోరిక తీర్చుకునేందుకు తప్పుడు మార్గం ఎన్నుకున్నాడా? అతని తీరులో దురుద్దేశం ఏదైనా ఉందా? అన్న అంశాలను కూలంకుషంగా పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

More Telugu News