beggar: యాచకుని వద్ద రూ.90 వేలు.. కృత్రిమ కాళ్లలో బయటపడిన నగదు!

  • అన్నీ రూ.500, రూ.100, రూ.50, రూ.20 కొత్తనోట్ల కట్టలు
  • బిచ్చగాడు మృతి చెందడంతో వెలుగులోకి విషయం
  • మృతి చెందిన షరీఫ్‌ సాబ్‌ హైదరాబాద్‌ వాసి

చనిపోయిన యాచకుని వద్ద భారీగా డబ్బు ఉండడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. కాళ్లులేని ఇతను నడవడానికి వినియోగిస్తున్న కృత్రిమ కాళ్లనే తన డబ్బు భద్రంగా దాచుకునేందుకు లాకర్‌లా ఉపయోగించుకోవడం విశేషం.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ కు చెందిన షరీఫ్‌ సాబ్‌ (75) రెండున్నర దశాబ్దాల క్రితం బెంగళూరు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ నగరంలోనే భిక్షాటన చేస్తూ బతుకుతున్నాడు. మధుమేహం కారణంగా గ్యాంగ్రిన్ బారినపడి రెండు కాళ్లు కోల్పోయాడు. దాతల సాయంతో శస్త్ర చికిత్స చేయించుకుని కృత్రిమ కాళ్లు సమకూర్చుకున్నాడు.

బెంగళూరులోని కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌పై స్థావరం ఏర్పర్చుకుని భిక్షాటనతో కాలం గడుపుతున్నాడు. మంగళవారం ఇతను చనిపోవడంతో మృతదేహాన్ని హైగ్రౌండ్స్‌ ఠానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని కృత్రిమ కాలు తొలగిస్తుండగా అందులో రూ.500, రూ.100, రూ.50, రూ.20 కొత్తనోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. వాటిని లెక్కించగా మొత్తం 90 వేల రూపాయలున్నట్లు గుర్తించారు. కాగా షరీఫ్‌ వద్ద లభ్యమైన ఓ చీటీ ఆధారంగా అతను హైదరాబాద్‌ వాసి అని పోలీసులు గుర్తించి అతని సోదరునికి సమాచారం ఇచ్చారు.

More Telugu News