ఇది పట్టపగలు హిందుత్వంపై అత్యాచారమే: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే

03-01-2019 Thu 09:43
  • పినరయి విజయన్ పై మండిపడ్డ కేంద్ర మంత్రి
  • భక్తుల మనోభావాలు పట్టించుకోరా?
  • శాంతిభద్రతల సంగతేంటి?: అనంత్ కుమార్

శబరిమలలోని అయ్యప్ప  ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశానికి కేరళ సర్కారు మద్దతివ్వడాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే తీవ్రంగా తప్పుబట్టారు. ఇది హిందుత్వంపై పట్టపగలు జరిగిన అత్యాచారమని ఆయన అభివర్ణించారు.

 "కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వామపక్ష అసూయను చూపిస్తున్నారు. దీంతో కేరళలో తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అయితే, రాష్ట్రంలోని శాంతిభద్రతలను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హిందువులపై పట్టపగలు జరిగిన అత్యాచారం ఇదని నేను అంటున్నాను" అని ఆయన అన్నారు.

కాగా, కేంద్ర మంత్రి అనంత్ కుమార్, ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు. 2017లో రాజ్యాంగంలోని 'సెక్యులర్' అన్న పదాన్ని తీసేస్తామని వ్యాఖ్యానించిన ఆయన, ఆపై ఓ వైద్యుడి చెంపను పగులగొడుతూ కెమెరాకు చిక్కారు. తాజా వ్యాఖ్యలతో, మరోసారి వివాదాన్ని రేపారు.