Telangana: ఆదిలాబాద్ లో వేదికపైనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు!

  • కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఘటన
  • సాజిద్ ఖాన్, నదీమ్ వర్గీయుల మధ్య గొడవ
  • సర్దిచెప్పిన సీనియర్ నేతలు

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. కాలర్లు పట్టుకుని ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చివరికి పార్టీ సీనియర్లు నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

  ఆదిలాబాద్ టౌన్ లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటమి సహా పలు అంశాలపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి వర్గీయుడైన నదీమ్‌ఖాన్‌ జిల్లా మైనార్టీ సెల్‌ చైర్మన్‌ సాజిద్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో రెచ్చిపోయిన సాజిద్ ఖాన్ వర్గీయులు నదీమ్ పై దాడికి దిగారు. చివరికి ఇరువర్గాలు పరస్పరం దాడిచేసుకోవడంతో సభా ప్రాంగణం రణరంగంగా మారింది.

దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి రామచంద్రారెడ్డి సహా సీనియర్ నేతలు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో భారీగా డబ్బును పంచిందని విమర్శించారు. అంతేకాకుండా ఈవీఎం ట్యాంపరింగ్ కు సైతం పాల్పడ్డారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News