KCR: కేసీఆర్ ఇంగ్లిష్, హిందీలో అంత చక్కగా చెప్పినా మోదీకి అర్థం కాలేదా?.. ఏదో మిస్సైంది!: విజయశాంతి ఎద్దేవా

  • కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటులో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తోంది
  • బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది
  • మోదీకి ఎందుకని అర్థం కాలేదు?

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి తనకు తెలియదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫార్ములా ఆయన ప్రత్యర్థులకు అర్థం కాలేదంటే నమ్మొచ్చు కానీ, మోదీకే అర్థం కాలేదంటే కచ్చితంగా అందులో ఏదో లోపం ఉన్నట్టేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రయత్నంలో ఏదో లోపం ఉన్నట్టు అనుమానం వస్తోందన్నారు.

కేసీఆర్ ఫ్రంట్‌పై ప్రధాని వ్యాఖ్యల తర్వాతైనా బీజేపీకి అర్థమయ్యేలా, వాళ్ల సిద్ధాంతాలకు అనుగుణంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అప్పటికి గానీ కేసీఆర్ ఫ్రంట్‌ను బీజేపీ గుర్తించే పరిస్థితి కనిపించడం లేదని విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బ్రహ్మాండంగా మాట్లాడతారని, సీఎం తన ఫ్రంట్ గురించి ఇంగ్లిష్‌లో అంత చక్కగా చెప్పినా మోదీకి ఎందుకు అర్థం కాలేదన్నదే ఇప్పుడు అసలుసిసలైన ప్రశ్న అని విజయశాంతి పేర్కొన్నారు.

More Telugu News