Rahul Gandhi: నాతో చర్చకు వచ్చే దమ్ము మోదీకి లేదు!: రాహుల్ గాంధీ ఫైర్

  • రాహుల్‌కు యుద్ధ విమానం అంటే ఏంటో తెలియదన్న జైట్లీ
  • తనతో 20 నిమిషాలు చర్చలో కూర్చోవాలంటూ సవాల్
  • విమానం ధర పెంచింది మీరు కాదా? అంటూ ప్రధానిపై నిప్పులు

రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందం బుధవారం లోక్‌సభను కుదిపేసింది. రాఫెల్ డీల్‌ను తొలి నుంచి ప్రచారాస్త్రంగా వాడుతూ బీజేపీని ఇరుకున పెడుతున్న రాహుల్‌కు అసలు యుద్ధ విమానం అంటే ఏమిటో తెలియదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. దీంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్ సవాలు విసిరారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు. కేవలం 20 నిమిషాలు తనతో చర్చలో కూర్చోవాలని సవాల్ చేశారు.

తనను ‘కిండర్‌గార్టెన్ అర్థమెటిక్’ అంటూ ఎద్దేవా చేసిన అరుణ్ జైట్లీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. జైట్లీ తనకుతానే 526, 1,600 నంబర్ల గురించి చెప్పారని పేర్కొన్నారు. ‘‘మీరు దేశానికి ఏం చెప్పారు? ఇది మొత్తం రూ. 58 వేల కోట్ల డీల్ అన్నారు. దీనిని 36తో  భాగిస్తే ఒక్కో విమానం ఖరీదు రూ. 1600 కోట్లు. అంటే ఒక్కో విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు పెంచేశారు. దీనికి కారణం మోదీ కాదా?’’ అని ప్రశ్నించారు.

‘‘మోదీతో నేను చర్చకు సిద్ధం. నాకు కేవలం 20 నిమిషాల సమయం  ఇవ్వండి చాలు. ముఖాముఖి చర్చించుకుంటే స్పష్టత వస్తుంది. అయితే, ప్రధానికి మాత్రం నాతో చర్చకు వచ్చే దమ్ము లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు.

More Telugu News