Sankranthi: సంక్రాంతిలోగా సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్ష: శివాజీ

  • అన్ని ఆధారాలను చంద్రబాబుకు అందజేస్తా
  • ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నతాధికారులు
  • ఆ భూములేమీ కలెక్టర్ల అబ్బ సొత్తు కాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరో కుట్రకు తెర లేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ.. విపక్షానికి ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిక లేకుండా పోయిందన్నారు. వారికి కావాల్సింది ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమేనని ఆరోపించారు. కొందరు ఉన్నతాధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీపై వారికి అంత ఇష్టముంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరాలని సూచించారు.

చుక్కల భూముల విషయంలో అధికారులు మంత్రులను కూడా లెక్కచేయడం లేదన్న శివాజీ భూముల సమస్య రాజకీయ నాయకులకు వరంగా మారిందన్నారు. ఈ భూముల విషయంలో సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయంలో కాస్త గట్టిగా మాట్లాడితే భూములను లాక్కుంటామంటూ కలెక్టర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ భూములేమీ కలెక్టర్ల అబ్బసొత్తు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కల భూముల విషయంలో అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని చంద్రబాబుకు అందజేస్తానని శివాజీ వివరించారు.

More Telugu News