YSRCP: జగన్‌పై దాడికి ముందు కోడికత్తికి బాగా సాన పట్టించిన శ్రీనివాసరావు: వివరాలు వెల్లడించిన సీపీ

  • అక్టోబరు 18నే దాడికి ప్లాన్.. 25న అమలు
  • జనవరిలోనే ఫ్లెక్సీ తయారు
  • జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు వెల్లడి


వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో కత్తి దాడి పక్కా ప్రణాళికతోనే జరిగిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సీపీ కేసుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాసరావు గతంలో వెల్డర్‌గా, కేక్ మాస్టర్‌గా, కుక్‌గా పనిచేశాడని తెలిపారు. నిజానికి గతేడాది అక్టోబరు 18నే జగన్‌పై దాడి చేయాలని శ్రీనివాసరావు పథకం రచించాడని కానీ, సాధ్యం కాకపోవడంతో అక్టోబరు 25న ప్లాన్‌ను అమలు చేశాడని పేర్కొన్నారు.

దాడి జరిగిన రోజే కోడికత్తికి శ్రీనివాసరావు సాన పట్టించాడని పేర్కొన్న సీపీ ఈ విషయం అతడి సహచరులకు కూడా తెలుసన్నారు. ఉదయం 4:55 గంటలకే ఇంటి నుంచి బయటకొచ్చిన శ్రీనివాసరావు 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్ చేసి ఈ రోజు తాను టీవీలో కనిపిస్తానని చెప్పాడని వివరించారు. ‘ఈ రోజు ఓ సంచలనం చూస్తారు’ అని అమ్మాజీతో శ్రీనివాసరావు పలుమార్లు చెప్పాడన్నారు. ఇకపై తన వద్దకు రావాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని వారికి చెప్పాడని సీపీ తెలిపారు.

ఉదయం 9 గంటల సమయంలో రెస్టారెంట్‌లో మరోసారి కోడికత్తికి సాన పెట్టిన అనంతరం దానిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేసినట్టు తెలిపారు. అనంతరం జగన్ విమానాశ్రయంలోకి రాగానే దానితో దాడి చేశాడని లడ్డా వివరించారు. జగన్‌తో తానున్న ఫ్లెక్సీని గతేడాది జనవరిలోనే శ్రీనివాసరావు తయారు చేసి పెట్టుకున్నాడని తెలిపారు. జగన్‌పై విష ప్రయోగం చేయాలనే ఉద్దేశం శ్రీనివాసరావుకు లేదని సీపీ పేర్కొన్నారు. 

More Telugu News