Uttar Pradesh: పార్టీ చీఫ్‌గా నా కొడుకు పనితీరు బాగా లేదు: అఖిలేష్‌పై ములాయం సంచలన వ్యాఖ్యలు

  • విధులను ఆయన సంతృప్తికరంగా నిర్వహించడం లేదని వ్యాఖ్య
  • రానున్న ఎన్నికల్లోనూ పార్టీకి బీజేపీ నుంచి ప్రమాదం ఉంది
  • ఇప్పుడే మేల్కోకపోతే నష్టం తప్పదు

పుత్ర వాత్సల్యంతో సలహాగానే ఇచ్చారో, ఆగ్రహంతోనే చేశారోగాని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌పై ఆయన తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌ వాదీ పార్టీ నేతలు మంగళవారం లక్నోలో ఏర్పాటుచేసిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ములాయంసింగ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ చీఫ్‌గా అఖిలేష్‌ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని ములాయం అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన బాధ్యతలను అఖిలేష్‌ సరిగా నిర్వర్తించడం లేదని, దీనివల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ చాలా ముందుకు వెళ్లిందని, ఇప్పటికైనా అఖిలేష్‌ మేలుకోకుంటే నష్టపోవడం ఖాయమని హెచ్చరించారు. ముఖ్యంగా పార్టీలో క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందని, పార్టీ వ్యవహారాల్లో మహిళలకు ప్రాధాన్యం పెంచాలని ములాయం సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి ఏర్పాటుకు ఓ వైపు అఖిలేష్‌ యాదవ్‌ చురుకుగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News