Sabari: ఆద్యంతం గోప్యత... అయ్యప్ప సన్నిధికి మహిళలు ఎలా వచ్చి వెళ్లారంటే..!

  • భక్తులకు అనుమానం రాకుండా అంబులెన్స్ లో మహిళలు
  • ముందు ఆలయం వద్ద భక్తులు లేకుండా చూసిన అధికారులు
  • వారిని వెన్నంటే వచ్చిన ఓ కెమెరా

మహిళలను ఎలాగైనా అయ్యప్ప సన్నిధికి తీసుకువెళ్లి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న కేరళ సర్కారు, అందుకు అనువైన సమయాన్ని ఎంచుకుని, ఆద్యంతం పూర్తి రహస్యంగా ఈ తెల్లవారుజామున సుప్రభాత సమయంలో బిందు, కనకదుర్గలను కొండపైకి తీసుకెళ్లింది. వీరు ఎవరికంటా పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్న అధికారులు, చిన్నపాదంవైపు కాకుండా, పంబ నుంచి సన్నిధానానికి వెళ్లే రోడ్డు మార్గం గుండా వీరిని తీసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఓ అంబులెన్స్ లో వీరిని కొండపైకి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అప్పటికే ఈ విషయాన్ని ఆలయం వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీసులకు విషయం చెప్పగా, వారు పదునెట్టాంబడి సమీపంలో భక్తులు ఎవరూ లేకుండా చూశారు.

ఆపై వీరు 18 బంగారు మెట్లపై నుంచి ఎక్కి, పరిగెత్తుతూ ఆలయంలోకి వెళుతుంటే, వెనుకే ఓ కెమెరా వీరిని అనుసరించింది. ఆ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వచ్చాయి. స్వామి దర్శనం అనంతరం వీరిని అంతే వేగంగా కొండ కిందకు దింపి, ప్రత్యేక వాహనంలో నీలక్కల్ దాటించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న విషయమై సమాచారం లేదు. ఇక ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేరళ బీజేపీ నేత రమేష్, శబరిమలలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్ లనూ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వీరు భక్తుల కంటబడకుండా కొండపైకి వచ్చారంటే, అది ప్రభుత్వ కుట్రేనని, తాము రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

More Telugu News