అయ్యప్ప గర్భగుడికి తాళం వేసిన పూజారులు, భక్తులు!

02-01-2019 Wed 11:02
  • ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు
  • తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న భక్తులు
  • అయ్యప్పను మహిళలు దర్శించుకున్నారన్న సీఎం  

50 ఏళ్ల వయసులోపున్న ఇద్దరు మహిళలు ఈ తెల్లవారుజామున శబరిమలకు వచ్చి పోలీసుల సాయంతో అయ్యప్పను దర్శించుకోవడంపై మండిపడుతున్న అయ్యప్ప పూజారులు, భక్తులు గర్భగుడికి తాళం వేశారు. ప్రస్తుతం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఆలయాన్ని దర్శించుకోగా, దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వారు ఆలయం వద్దకు వచ్చిన వేళ, మీడియా ప్రతినిధులు ఎవరూ అక్కడ లేరు. భక్తుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది. వారికి రక్షణగా వచ్చిన పోలీసుల సంఖ్య కూడా స్వల్పమే. కేరళ ముఖ్యమంత్రి సైతం ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇద్దరు మహిళలు స్వామిని పూజించారని, వారికి పోలీసులు రక్షణగా నిలిచారని అన్నారు. కాగా, కావాలనే కేరళ ప్రభుత్వం సమయం చూసి మహిళలను ఆలయంలోకి పంపి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ ఆరోపించింది.