Love: 41 రోజుల మౌనపోరాటం తరువాత... ప్రేమను గెలిపించుకున్న వరంగల్ యువతి!

  • హైదరాబాద్ లో సుధీర్ ను ప్రేమించిన శ్వేత
  • సుధీర్ పెళ్లికి అంగీకరించకపోవడంతో మౌనపోరాటం
  • చివరకు దిగివచ్చి వివాహమాడిన సుధీర్

తను మనసిచ్చిన వాడితోనే వివాహం జరిపించాలన్న ఆ యువతి పట్టుదలే చివరకు గెలిచింది. మౌన పోరాటం చేస్తూ తన ప్రేమను గెలిపించుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తికి చెందిన శ్రీపతి శ్వేత ప్రేమకథ ఇది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సూరారం గ్రామానికి చెందిన సట్ల సుధీర్‌ గౌడ్‌ అనే యువకుడితో శ్వేత ప్రేమలో పడింది. ఇద్దరూ హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారే. ఇద్దరి కులమూ కూడా ఒకటే. దీంతో తొలుత రెండు కుటుంబాలూ వారి పెళ్లికి ఒప్పుకున్నాయి.

పెళ్లికి ఏ అడ్డంకులూ లేవని అందరూ భావిస్తున్న సమయంలో సుధీర్‌ ప్లేటు ఫిరాయించాడు. శ్వేతను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె నవంబరు 21న అతని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. రోజులు గడిచినా తన ప్రియుడు మారకపోవడంతో డిసెంబరు 16న ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి కుటుంబీకులు చూడటంతో ఆమె ప్రాణాలు మిగిలాయి.

ఆపై విషయం పోలీసులకు చేరగా, కేసు కూడా నమోదైంది. దీంతో సుధీర్ దిగివచ్చాడు. తను చేసిన తప్పును తెలుసుకుని, శ్వేతను వివాహం చేసుకునేందుకు సిద్ధమేనంటూ ఎల్కతుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆపై పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లికి ఇద్దరూ అంగీకారం తెలిపారు. ఆపై కొత్తగట్టులో మత్స్యగిరీంద్ర స్వామి ఆలయంలో వారి ప్రేమకథకు పెళ్లితో శుభంకార్డు పడింది. అయితే, ఈ పెళ్లికి సుధీర్ తల్లిదండ్రులు మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.

More Telugu News