Kodandaram: నేను ముందే చెప్పినా వినలేదు... అందుకే ఓడిపోయాం: కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

  • ఓటమిపై రాజకీయ విశ్లేషణ జరగాలి
  • కేసీఆర్ గురించి తెలియదని చెప్పినా ఉత్తమ్, రమణ వినలేదు
  • హైదరాబాద్ లో మీడియాతో కోదండరామ్ చిట్ చాట్

గత నెలలో తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషణ జరగాల్సివుందని కూటమి భాగస్వామి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు తదితరాలపై తాను ఎంతగా చెప్పినా వినలేదని, కేసీఆర్ శైలి గురించి తెలియదని, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

 హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, ప్రచారం 15 రోజులు చేసినా సరిపోతుందని ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానిస్తే, మూడు వారాలు సరిపోతుందని ఎల్ రమణ అన్నారని, ప్రచారంలో సమగ్ర వ్యూహం లోపించిందని ఆయన అన్నారు. కేసీఆర్‌ తో పదేళ్లపాటు కలసి పని చేసిన తాను, ఆయన ప్రచారశైలిపై ఎన్నిసార్లు కూటమి నేతలకు హెచ్చరించినా వినిపించుకోలేదన్నారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ తనపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను చల్లబరచుకున్నారని అభిప్రాయపడ్డ కోదండరామ్, ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో మాత్రం ఆయన సక్సెస్ కాబోరని అన్నారు.

తమ నాలుగేళ్ల శ్రమ వృథాగా పోయిందని వ్యాఖ్యానించిన ఆయన, సమయాభావం వల్ల ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేకపోయామని, మంచి ఎజెండా, మేనిఫెస్టో ఉన్నా ప్రజలకు చేర్చలేకపోయామని అన్నారు. కొందరు నేతల అతి ఆత్మవిశ్వాసం కూడా కొంపముంచిందని, ఓటమి తరువాత అసలు కారణాలను విశ్లేషించకుండా, ఈవీఎంలపై తప్పు నెట్టడంలో అర్థం లేదని అన్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనక ఎవరు ఉన్నారో పరిశీలిస్తానని, లోక్‌ సభకు జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు.

More Telugu News