Andhra Pradesh: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవింగ్.. నలుగురు బీటెక్ విద్యార్థుల దుర్మరణం!

  • గుంటూరు జిల్లా లాల్ పురం వద్ద ఘటన
  • డివైడర్, లారీని ఢీకొట్టిన కారు
  • ఎగిరి పక్కన పడిపోయిన లారీ

గుంటూరు జిల్లా లాల్ పురం వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా గుద్దుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారులో పార్టులన్నీ ఊడిపోయి రోడ్డుపైన పడిపోయాయి. వాహనం నామరూపాలు లేకుండా పోయింది.

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. చనిపోయినవారంతా గుంటూరు జిల్లాలోని ఆర్వీఆర్, జేసీ ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులని తెలిపారు. ప్రమాద సమయంలో కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని వెల్లడించారు. కారు ఢీకొట్టడంతో లారీ కంటైనర్ సైతం పల్టీ కొట్టిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపామని అన్నారు.

More Telugu News