Telangana: పోర్న్ చిత్రాలు చూపిస్తూ భార్యకు టార్చర్.. సైకో భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో ఘటన
  • మైనర్ ను వివాహమాడిన వ్యక్తి
  • కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

చాలా ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఓ భర్త చుక్కలు చూపించాడు. పెళ్లయిన మొదటి రోజు నుంచే నీలి చిత్రాలు చూపిస్తూ అందులో ఉన్నట్లు చేయాలని వేధించసాగాడు. దీన్ని తట్టుకోలేని బాధితురాలు తిరగబడటంతో వేడి నీళ్లు పోసి మరింతగా టార్చర్ పెట్టాడు. ఈ వేధింపుల పర్వంపై పోలీసులు సైతం తొలుత కేసు నమోదు చేయలేదు. చివరికి ఉన్నతాధికారుల చొరవతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లోని బడీచౌడీ ప్రాంతంలో బాధితురాలు(17) తన అమ్మమ్మతో కలిసి నివాసం ఉంటోంది. ఈ క్రమంలో జనగామకు చెందిన ఆకుల సృజన్‌ (30) అమ్మాయి కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇక వివాహమైన మొదటి రోజు నుంచే బాధితురాలికి అతను చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. నీలి చిత్రాలు చూపుతూ అలాగే చేయాలని వేధించసాగాడు. అందుకు ఒప్పుకోకుంటే వేడినీళ్లు శరీరంపై పోసి రాక్షసానందం పొందేవాడు.

సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసేవాడు. దీంతో ఈ టార్చర్ తట్టుకోలేని యువతి పుట్టింటికి వచ్చేసింది. చివరికి మళ్లీ ఆమెను సంసారానికి తీసుకెళ్లేందుకు భర్త సృజన్‌ రావడంతో చచ్చినా అతనితో పోనని యువతి తెగేసి చెప్పింది. ఈ వేధింపులపై అమ్మమ్మతో కలిసి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే పోలీసులు సదరు ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడంతో తెలంగాణ మానవహక్కుల ప్రతినిధి శీలం సరస్వతిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో బాధితురాలిని తీసుకుని ఆమె సుల్తాన్ బజార్ ఏసీపీ డా.చేతనను కలిశారు. చివరికి ఈ వ్యవహారంపై కేసు నమోదుచేయాలని ఏసీపీ ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. మైనర్ ను వివాహం చేసుకున్నందుకు పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News