Andhra Pradesh: హైకోర్టు తరలింపు మొదలు... తెలంగాణ న్యాయవాదుల భావోద్వేగం!

  • ఏపీ హైకోర్టు సామాన్లు తరలించేందుకు వచ్చిన బస్సులు
  • నిన్నటివరకూ కలిసున్న న్యాయవాదులు, న్యాయమూర్తులు
  • అభినందనలు చెబుతూనే కన్నీరు

తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజనకు కేంద్రం, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రేపటి నుంచి అమరావతిలో కోర్టు సేవలను నిర్వహించాల్సి వుండటంతో హైదరాబాద్ లో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. న్యాయవాదులు, సిబ్బంది, టన్నుల కొద్దీ ఫైళ్లను అమరావతికి తరలించేందుకు ఈ ఉదయం అఫ్జల్ గంజ్ సమీపంలోని తెలుగు రాష్ట్రాల హైకోర్టు (ఇక రేపటి నుంచి తెలంగాణ హైకోర్టు)కు బస్సులు, లారీలు చేరుకోగా, తరలింపు ప్రక్రియ మొదలైంది.

రాజకీయ కారణాలు, సెంటిమెంట్, ప్రత్యేక కోర్టులు... ఇటువంటివన్నీ ఎలాగున్నా నిన్నటి వరకూ కలిసిమెలిసి వున్న తెలంగాణ, ఆంధ్రా లాయర్లు, సిబ్బంది నేడు ఒకరిని ఒకరు విడిచి వెళ్లిపోతున్న వేళ, పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఆంధ్రాలాయర్లు, సిబ్బంది, తెలంగాణ న్యాయమూర్తులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు చెబుతూనే, ఇలా విడిపోవడం తమకెంతో బాధ కలిగిస్తోందని అంటున్నారు. కాగా, ఈ బస్సులు, లారీలు నేటి రాత్రికి విజయవాడకు చేరుకోనుండగా, సీఎం క్యాంప్ ఆఫీస్ సహా, పలు భవనాలను తాత్కాలిక హైకోర్టు భవనాలుగా ఏపీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News