ap police: పోలీసులకు కొత్త వాహనాలు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

  • వాహనాలను విజయవాడలో నేడు ప్రారంభించనున్న సీఎం
  • గ్రామీణ ప్రాంతాల్లోని స్టేషన్లకు కార్లు, జీపులు, బైక్‌లు
  • ఇటీవలే పలువురికి పదోన్నతులు ఇచ్చిన సర్కారు

వాహనాలు లేక, డొక్కు వాహనాలతో పడలేక సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లతో సహా అవసరమైన అన్ని ప్రాంతాలకు వాహనాలను సమకూర్చనుంది. ఇందుకు అవసరమైన అధునాతన సదుపాయాలున్న కార్లు, జీపులు, బైక్‌లను కొనుగోలు చేసింది. విజయవాడలో నేడు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు.

ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవలే ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019 మంది కానిస్టేబుళ్లు, 566 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, పలువురు ఎస్‌ఐలకు పదోన్నతి ఇచ్చింది. మరో 45 మంది డీఎస్సీలకు అడిషనల్‌ ఎస్పీ, ఏఎస్పీలుగా పదోన్నతులు కల్పించనున్నట్లు ప్రకటించింది. తాజాగా కొత్త వాహనాలు కూడా సమకూర్చుతుండడంతో పోలీసు శాఖలో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది.

రెండునెలల క్రితం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు అధికారులు పోలీస్‌ స్టేషన్లకు వాహనాలు లేని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో  వాహనాలు సమకూర్చుకునేందుకు వెంటనే రూ.50 కోట్లు విడుదల చేశారు. వాహనాలు ప్రారంభించనున్న సందర్భంగా ముఖ్యమంత్రిని సన్మానించనున్నట్లు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నిర్ణయించింది.

More Telugu News