Andhra Pradesh: హైదరాబాద్ లాంటి రాజధాని కోసం రూ.5 లక్షల కోట్లు కావాలి.. ఇది కేసీఆర్ కు తెలియదా?: మంత్రి నారాయణ

  • రూ.1,500 కోట్లతో సర్దుకోవాలా?
  • కేసీఆర్ పై మండిపడ్డ ఏపీ మంత్రి
  • హైకోర్టును జనవరి 31లోగా పూర్తిచేస్తామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సచివాలయాన్ని డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. జనవరి 31లోగా హైకోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు భవనంలోని మొదటి అంతస్తులో 12 కోర్టు హాళ్లు, రెండో అంతస్తులో 4 కోర్టు హాళ్లు ఉంటాయని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో ప్రజల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలోనూ రాఫ్ట్ సాంకేతికతను వాడామని పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న హైకోర్టు భవనం నిర్మాణ పనులను మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు.

జనవరి 15 నాటికి హైకోర్టులో పార్కింగ్, లాన్ల ఏర్పాట్లు పూర్తవుతాయని నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం సాగడంలేదని విమర్శించేవాళ్లు ఓ సారి అమరావతికి వచ్చి చూడాలని సూచించారు. రాజధానికి కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లు చాలవా? అని కేసీఆర్ అడుగుతున్నారనీ, అంటే ఆ మొత్తంతో సర్దుకోవాలని చెప్పడం కేసీఆర్ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లాంటి రాజధానిని కట్టుకోవడానికి రూ.5 లక్షల కోట్లు అవసరం అవుతాయని కేసీఆర్ కు తెలియదా? అని నిలదీశారు.

More Telugu News