Telangana: ఓట్ల గల్లంతు వల్ల తెలంగాణ ఎన్నికల్లో నష్టపోయింది మనమే: విజయోత్సవ ర్యాలీలో కేటీఆర్

  • తెలంగాణలో గల్లంతైన 22 లక్షల ఓట్లు
  • టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీ పడిపోయిందన్న కేటీఆర్
  • అన్ని హామీలనూ టీఆర్ఎస్ నెరవేరుస్తుందని వ్యాఖ్య
  • కూకట్ పల్లిలో టీఆర్ఎస్ విజయోత్సవ సభ

తెలంగాణలో దాదాపు 22 లక్షల ఓట్లు గల్లంతైన కారణంగా నష్టపోయిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేడు కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రసంగించిన ఆయన, ఎంతో మంది టీఆర్ఎస్ అభ్యర్థులు 60 నుంచి 70 వేల మెజారిటీతో గెలవాల్సిందని, ఓట్లు గల్లంతైనందున వారి మెజారిటీ 40 వేలకు పడిపోయిందని చెప్పారు.

ఎన్నికలకు ముందే తాము భారీ స్థాయిలో గెలవనున్నామని ముందే చెప్పామని గుర్తు చేసిన కేటీఆర్, తమ పార్టీపై నమ్మకముంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు ఓ మాట, తరువాత మరోమాట చెప్పే అలవాటు టీఆర్ఎస్ పార్టీకి లేదని, ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేరుస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 26 బీసీ కులాలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు.

కేసీఆర్ పై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించారని చెప్పారు. కూకట్ పల్లి అభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పారు. జనవరి చివరి వారం వరకూ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, ఓట్లు గల్లంతైన వారు తిరిగి నమోదు చేయించుకోవాలని కోరారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలు ఓట్ల నమోదు విషయంలోనూ శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ విజయంతో తెలంగాణలో టీఆర్ఎస్ బాధ్యత మరింతగా పెరిగిందని వ్యాఖ్యానించిన ఆయన, ఎంతోమంది జాతీయ నేతలు ప్రచారం చేసినా ప్రజల దృష్టిని మళ్లించలేకపోయారని అన్నారు.

కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిని చేసి చూపిస్తామని, ప్రజా సంక్షేమం నిరంతరంగా జరగాల్సిన పనని నమ్మే నేత కేసీఆర్ అని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు అన్న మాట వినపడకుండా చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకన్నా ఘనమైన మెజారిటీని ఇచ్చి, 16 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిద్దామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

More Telugu News