Somasila AG Politechnic: మృత్యువుతో పోరాడుతూ శ్రుతి కన్నుమూత... ప్రత్యేక బస్సుల్లో వచ్చిన విద్యార్థిలోకం!

  • సోమశిల ఏజీ పాలిటెక్నిక్ విద్యార్థిని ఎన్ శ్రుతి 
  • కామెర్లు సోకి దెబ్బతిన్న కాలేయం
  • స్నేహితులు డబ్బు సేకరిస్తున్న వేళ విషమించిన ఆరోగ్యం
  • కడసారి చూపు కోసం ప్రత్యేక వాహనాలు సమకూర్చిన కాలేజ్

కామెర్ల వ్యాధిని గుర్తించడంలో ఆలస్యంకాగా, దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన సోమశిల ఏజీ పాలిటెక్నిక్ విద్యార్థిని ఎన్ శ్రుతి కన్నుమూసింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శ్రుతి కాలేయం తీవ్రంగా దెబ్బతినడంతో, కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు తేల్చడంతో, అందుకు అవసరమైన రూ. 40 లక్షల సేకరణకు ఆమె చదువుకుంటున్న పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో శ్రుతి విషయం తొలిసారి వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే కొంతమొత్తం సేకరించిన విద్యార్థులు, డబ్బు కోసం మరింత ముమ్మరంగా ప్రయత్నిస్తున్న వేళ, ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు కూడా తరలించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి, మరణించడంతో సహచర విద్యార్థులు బోరున విలపించారు.

శ్రుతి స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కనిగిరికి మృతదేహాన్ని తరలించగా, ఈ విషయం తెలుసుకున్న సహచరులు, తన స్నేహితురాలిని కడసారి చూసేందుకు పంపించాల్సిందేనని పట్టుబట్టి నిరసనలకు దిగారు. దీంతో కనిగిరికి విద్యార్థులను పంపేందుకు సోమశిల ఏజీ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని, ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. దీంతో వారంతా కనిగిరికి చేరుకుని శ్రుతికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

More Telugu News