Prime Minister: నాకు ఎంతో గర్వంగా ఉందిప్పుడు: నరేంద్ర మోదీ

  • 'స్వచ్ఛ భారత్ మిషన్' విజయవంతమైంది
  • మహాయజ్ఞంలా ప్రతి ఒక్కరూ భావించారు
  • ప్రకృతితో మమేకమైన భారత పండగలు
  • 'మన్ కీ బాత్'లో ప్రధాని

భారతావనిని స్వచ్ఛంగా మార్చాలన్న ఉద్దేశంతో తాము ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్ మిషన్' ప్రచారం ప్రతి ఒక్కరి చొరవతో విజయవంతం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాట (మన్ కీ బాత్)ను వినిపించిన ఆయన, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ను పరిశుభ్రంగా చేసేందుకు మూడు లక్షల మంది కదిలొచ్చారని అన్నారు. దీన్ని ఓ మహాయజ్ఞంలా భావించి అన్ని పురపాలక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు.

నేటి తరం యువత క్రీడలపై ఆసక్తిని పెంచుకుంటోందని, ఈ విషయంలో వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని అన్నారు. జాతి ఐక్యతను మన పండగలు కలిపివుంచుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ప్రతి పండగ, ప్రకృతితో మమేకమైనదేనని అన్నారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే సందర్భంగానే సంక్రాంతి పర్వదినాన్ని మరో రెండు వారాల్లో జరుపుకోబోతున్నామని నరేంద్ర మోదీ చెప్పారు.

ఉగాది లేదా గుడి పడవా చాంద్రమానం ప్రకారం తొలి రోజున వస్తుందని గుర్తు చేశారు. పండగల వేళ తాము తీసుకునే ఫోటోలను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని, దీని ద్వారా భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వం, సంస్కృతి, సంప్రదాయాల గురించి అందరికీ తెలుస్తాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ప్రారంభం కానున్న కుంభమేళాకు ఎంతో చరిత్ర ఉందని, కుంభమేళాను ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూపించారని, కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తామని చెప్పారు.

More Telugu News