winter effect: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి...కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  • సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు
  • హైదరాబాద్‌లో 9.9 డిగ్రీలు
  • పాడేరులో 5 డిగ్రీలు...అమ్మవారి పాదాలలో 4 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఐదు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ నగరం, విశాఖ ఏజెన్సీలో చలిపులి మరింత విజృంభిస్తోంది. ఉదయం 9గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. శనివారం హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 9.9 డిగ్రీలకు పడిపోయాయి. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2010 డిసెంబరు 21న 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా, మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

గత ఏడాది ఇదే కాలంలో 10.8 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు 1966 డిసెంబరు 14న 7.1 శాతం డిగ్రీలుగా నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లాలోని పాడేరులో శనివారం 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమ్మవారి పాదాలలో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి, చింతపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి.

ఏటా డిసెంబరు, జనవరి నెలల్లో ఈ ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మూడు డిగ్రీల నుంచి ఒక్కోసారి మైనస్‌ డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఉదయం 11 గంటలైనా సూర్యుని దర్శనం లభించదు. మంచుతెరలు చేతికందే ఎత్తులో కనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఈ అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శనకు లంబసింగి, చింతపల్లి వస్తుంటారు.

More Telugu News