India: భారత్ ఘనవిజయం.. 2018ని సగర్వంగా ముగించిన టీమిండియా!

  • మూడో టెస్టులో ఘన విజయం
  • 2-1 తేడాతో సిరీస్ లో ముందంజ
  • 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్

మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 2-1తో ముందడుగు వేసింది. నేడు ఉదయం నాలుగో రోజు ఆటకు వరుణుడు కాసేపు ఆటంకం కల్పించినా, ఆపై ఆట కొనసాగింది.

నిన్న భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన కుమిన్స్, లియాన్ లు ఆచితూచి ఆడుతున్నా, బుమ్రా, ఇషాంత్ లు తమ పదునైన బంతులతో వారికి చెక్ చెప్పారు. 399 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయింది. కుమిన్స్ వికెట్ ను బుమ్రా తీసుకోగా, ఇషాంత్ శర్మ లియాన్ ను బుట్టలో పడేశాడు. వీరిద్దరూ 261 పరుగుల వద్దే అవుట్ అయ్యారు.

 కాగా, వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ ఓ సిరీస్ లో అత్యధిక క్యాచ్ లు పట్టుకున్న భారత వికెట్ కీపర్ గా (20 క్యాచ్ లు) నిలిచాడు. ఈ విజయంతో 2018 సంవత్సరాన్ని భారత క్రికెట్ జట్టు సగర్వంగా ముగించినట్లయింది. నాలుగో మ్యాచ్ సిడ్నీలో జరుగనుండగా, అక్కడ మ్యాచ్ ఫలితం ఏదైనా బార్డర్ - గవాస్కర్ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతుల్లోనే ఉంటుంది.

More Telugu News