Pakistan: నాకు సహకరించండి... అమెరికన్ అధికారులతో ముషారఫ్... వీడియో కలకలం!

  • సోషల్ మీడియాలో పోస్టు చేసిన పాకిస్థానీ కాలమిస్ట్
  • కోవర్ట్ మద్దతు కావాలని కోరుతున్న ముషారఫ్
  • ప్రస్తుతం దేశం విడిచి దూరంగా ఉన్న మాజీ అధ్యక్షుడు

పాకిస్థాన్ లో తాను తిరిగి అధికారాన్ని పొందేందుకు అమెరికా సహకరించాలని కోరుతున్న మాజీ నేత ముషారఫ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. దీన్ని ఎప్పుడు చిత్రీకరించారో తెలియదుగానీ, పాకిస్థానీ కాలమిస్ట్ గుల్ బుఖారీ దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొందరు అమెరికా ఉన్నతాధికారులతో ముషారఫ్ మాట్లాడుతున్న ఈ వీడియోలో అమెరికా మద్దతిస్తే, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం తనకు సులభమేనని అన్నారు.

కాగా, అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, పాక్ లోనే ఉన్నా ఆయన్ను గుర్తించడంలో విఫలమయ్యారని ముషారఫ్ సర్కారుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2001 నుంచి 2008 మధ్య పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్, తనను పదవీచ్యుతుడిని చేయడం ఖాయమని తెలుసుకుని, స్వయంగా అధికార పీఠం నుంచి దిగారన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన కోర్టు కేసులకు భయపడి పాక్ విడిచి పారిపోయారు.

"నేను చెప్పేది ఏంటంటే... నాపై కొన్ని అభియోగాలు ఉండవచ్చు. నేను తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు మీ మద్దతు కావాలి. అది కూడా కోవర్ట్ మద్దతై ఉండాలి. అప్పుడే మనం గెలుస్తాం" అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అమెరికా ఇచ్చిన డబ్బుతోనే పాక్ టెర్రరిజంపై పోరాడుతోందని, తన హయాంలో పేదరికాన్ని 34 శాతం నుంచి 17 శాతానికి తగ్గించామని చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ పాక్ లో ఉన్నా కనుగొనడంలో విఫలమైన మాట నిజమేనని, ఈ విషయంలో ఐఎస్ఐని క్షమించవచ్చని అభిప్రాయపడ్డ ముషారఫ్, 9/11 దాడుల విషయంలో తమ దేశంలోనే నిందితులు ఉన్నా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయిందని వ్యాఖ్యానించారు.

More Telugu News