Aravind kejriwal: కేంద్ర ప్రభుత్వం మాపై సీబీఐ సోదాలు జరిపింది: కేజ్రీవాల్

  • దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయి 
  • బీజేపీ, కాంగ్రెస్ చేయలేని పనుల్ని చేసి చూపించాం
  • ప్రజల్లో మా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
  • మళ్లీ మా పార్టీనే కోరుకుంటున్నారు

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ తీరు కారణంగా తామెన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ పార్టీ 7వ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమను అవమానించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని.. సీబీఐ సోదాలు కూడా జరిపిందన్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ గెలుపును కాకుండా... బీజేపీ ఓటమిని ఎక్కువగా ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశంలో ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని.. ఈ తప్పు దేశ రాజకీయాలదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించవచ్చో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగేళ్లలో చూపించిందన్నారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ చేయలేని పనులను తాము ఢిల్లీలో చేసి చూపించామని ఆయన తెలిపారు. ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఏమాత్రం వ్యతిరేకత లేదని.. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీనే కోరుకుంటున్నారన్నారు. పాలన బాగుంటే రైతుల ఆత్మహత్యలు ఉండవని, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ బాగుంటాయని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

More Telugu News