kcr: ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడితే.. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూశారు కదా!: కేసీఆర్

  • రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
  • బీసీలను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే
  • మోదీ, అమిత్ షాలు ప్రచారం చేసినా... బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు

ఎన్నికల్లో తిరస్కరించిన జాతీయ పార్టీలకు ఇంకా బుద్ధి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారని... ఇప్పుడు మళ్లీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూశారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ నేతలు అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. మార్కెట్ కమిటీల్లో బీసీల రిజర్వేషన్లను తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు ఆదేశాలతో జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని కేసీఆర్ తెలిపారు. కొత్త చట్టం ప్రకారం 61.19 రిజర్వేషన్లను పెట్టామని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ సీఎంలు వచ్చి ప్రచారం చేసినా... 103 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరినా... పట్టించుకోలేదని విమర్శించారు.

More Telugu News