Andhra Pradesh: ఈసారి అధికారంలోకి రాలేమని చంద్రబాబుకు భయం పట్టుకుంది!: వైసీపీ నేత బొత్స

  • హైదరాబాద్ ను స్వార్థంతో వదులుకున్నారు
  • అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అండగా ఉంటుంది
  • హోదాను తాకట్టు పెట్టి పోలవరం తెచ్చుకున్నారు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికలు ఇంకా 100 రోజులే ఉండటంతో ఈసారి అధికారంలోకి రాలేమని చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు బహిరంగ సభలు, సమీక్షా సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కుని పారిపోయి వచ్చారని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని బొత్స విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందనీ, వారికి న్యాయం జరిగే వరకూ విశ్రమించబోమని స్పష్టం చేశారు. జగన్ కోసమే హైకోర్టును విభజించారని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పదేళ్ల రాజధానిని ముందుగానే వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు పోలవరం కాంట్రాక్టును తీసుకున్నారని ఆరోపించారు. కేవలం డ్యామ్ కు ఒకే గేటు పెట్టి నీళ్లు ప్రతీ ఇంటికి వచ్చేసినట్లు, విశాఖ ప్రజలంతా పోలవరం నీటినే తాగుతున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేట్లు ఇంకా 47 పెట్టాల్సి ఉందనీ, ఒక్కో గేటు నిర్మాణానికి 60 రోజులు పడుతుందని చెప్పారు.

More Telugu News