Andhra Pradesh: జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు పోతున్నారు.. చంద్రబాబుపై వున్న కేసుల్లో కనీసం విచారణ కూడా ఎందుకు జరగడం లేదు!: జీవీఎల్ ప్రశ్న

  • విచారణ జరిగితే ఇంకా సీఎం కుర్చీలోనే ఉండేవారా?
  • చంద్రబాబువి దివాళాకోరు రాజకీయాలు
  • ప్రజలు అమాయకులు కాదు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు మతి భ్రమించినట్లు అనుమానం కలుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రతీ శుక్రవారం జైలుకు వెళుతుంటే, సీఎం చంద్రబాబుపై ఉన్న కేసులు కనీసం విచారణకు కూడా రావడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిజంగా చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణ జరిగితే ఆయన ఇంకా సీఎం కుర్చీలోనే ఉండేవారా? అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసనీ, వారిని అమాయకులు అనుకోవద్దని హితవు పలికారు. తమపై నమోదయిన కేసులు విచారణకు రాకున్నా ఫరవాలేదు కానీ జగన్ కు మాత్రం వారం రోజుల్లో శిక్ష విధించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది ఏపీ సీఎం దగుల్బాజీ, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

More Telugu News