Andhra Pradesh: 1998లోనే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం.. ఏపీలో మిగులు విద్యుత్ ను సాధించాం!: చంద్రబాబు

  • 100 శాతం విద్యుత్ అమలు రాష్ట్రంగా అవతరించాం
  • 2004-14 ఏపీ చరిత్రలో చీకటి రోజులు
  • ఇంధనం-మౌలిక రంగాలపై శ్వేతపత్రం విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని పరుగులు పెట్టించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం నూతనంగా ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రభుత్వ చొరవ కారణంగా 100 శాతం విద్యుత్ అమలు రాష్ట్రంగా ఏపీ అవతరించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తలసరి విద్యుత్ వినియోగం ఏకంగా 1,174 యూనిట్లకు చేరిందన్నారు. అమరావతిలోని ప్రజావేదికలో ‘ఇంధనం-మౌలిక రంగాల్లో అభివృద్ధి’పై చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

1998లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ సంస్కరణల కారణంగానే ఈరోజు ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. 2004-2014 ఏపీ చరిత్రలో చీకటి రోజులని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 19,080 మెగావాట్లకు చేరుకుందనీ, ఏపీ విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలిచిందని వెల్లడించారు. తాజాగా ఇప్పుడు పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా సోలార్, పవన విద్యుత్, హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. 

More Telugu News