Andhra Pradesh: వెనుకబడిన వర్గాలకు టీడీపీ అన్నివేళలా అండగా నిలిచింది: సీఎం చంద్రబాబు

  • అనకాపల్లిలో మెగా గ్రౌండింగ్ మేళా ప్రారంభం
  • వెనుకబడిన వర్గాలకు మేలు చేసిన ఏకైక పార్టీ టీడీపీ
  • ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం

వెనుకబడిన వర్గాల వారికి టీడీపీ అన్నివేళలా అండగా నిలిచిందని, నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కూడా పేదలే తమకు అండగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో మెగా గ్రౌండింగ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఆదరణ పథకం మూడో విడత కింద లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న ‘పేదరికంపై గెలుపు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు మేలు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. పేదలు కడుపునిండా తినాలనే ఉద్దేశంతోనే ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ఎన్టీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు. వికలాంగులకు చేయూత పథకం కింద సాయం చేశామని అన్నారు.

గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ చేపట్టిందని 1.40 లక్షల కుటుంబాలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని, ఎన్ని కష్టాలు వచ్చినా, పింఛన్లు మాత్రం ఆపకుండా అందజేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాన్ని నాడు తానే ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. పేదలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత టీడీపీదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పునర్విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి మరోసారి ప్రస్తావించారు. హేతుబద్ధతలేని విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, విభజన చట్టం ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పిందని అన్నారు. 

More Telugu News