Andhra Pradesh: విశాఖపట్నంలో ఎయిర్ షో రద్దుపై.. సింగపూర్ నుంచి తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్!

  • వాయుసేన సిబ్బందిని వెనక్కి పిలిచిన రక్షణ శాఖ 
  • రిహార్సల్స్ పూర్తి అయ్యాక నిర్ణయం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ఐటీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం విశాఖ ఉత్సవ్ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లను పూర్తిచేసింది. అయితే ఈ వేడుకల్లో నిర్వహించే ఎయిర్ షోలో పాల్గొనేందుకు వచ్చిన వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన 90 మంది సిబ్బందిని రక్షణ శాఖ ఆకస్మికంగా వెనక్కు పిలిపించింది. రిహార్సల్స్ పూర్తి అయ్యాక రక్షణ శాఖ ఈ రీతిలో వ్యవహరించడంపై ఏపీ ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.

 ‘తెలుగువారిని అవమానించడాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏపీలో విశాఖ ఉత్సవ్ లో జరగాల్సిన ఎయిర్ షోను రద్దుచేశారు. ఇది తెలుగువాళ్లను అవమానించే చర్య కాకుంటే ఇంకేమిటి?’ అంటూ లోకేశ్ ట్విట్టర్ లో మండిపడ్డారు. గత మూడు రోజులుగా సింగపూర్ లో ఉన్న మంత్రి నారా లోకేశ్ పర్యటన నేటితో ముగియనుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం కావాలని కక్షపూరితంగానే ఎయిర్ షోను రద్దుచేసిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే.

More Telugu News