team india: కుప్పకూలిన ఆస్ట్రేలియా.. ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్

  • 151 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా
  • తొలి ఇన్నింగ్స్ లో 292 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా
  • 6 వికెట్లు పడగొట్టిన బుమ్రా

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. ముఖ్యంగా పేసర్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 443 పరుగులు చేసిన భారత్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. కానీ, ఈ రోజు మాత్రం భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా కుప్పకూలింది. 66.5 ఓవర్లను ఎదుర్కొన్న ఆసీస్ 151 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ నడ్డి విరిచాడు.

ఆసీస్ బ్యాట్స్ మెన్లలో హారిస్ 22, ఫించ్ 8, ఖవాజా 21, షాన్ మార్ష్ 19, హెడ్ 20, మిచెల్ మార్ష్ 9, పైన్ 22, కమిన్స్ 17 పరుగులు చేయగా లియోన్, హాజిల్ వుడ్ లు డకౌట్ అయ్యారు. స్టార్క్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 6, జడేజా 2 వికెట్లు తీయగా శర్మ, షమీలు చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 292 పరుగుల లీడ్ సాధించింది. ఆసీస్ కు ఫాలోఆన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ... భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.


More Telugu News