Andhra Pradesh: సమయానికి మాయమైన పెళ్లి కొడుకులు... ఆగిన రెండు పెళ్లిళ్లు!

  • ఏపీలో ఒకటి, తెలంగాణలో మరొకటి
  • పెళ్లి ఇష్టంలేక పారిపోయిన యువకులు!
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆడపెళ్లివారు

పెళ్లంటే ఇష్టం లేదో లేక మరే ఇతర కారణాలు ఉన్నాయోగానీ, సమయానికి పెళ్లి కుమారులు కనిపించకపోవడంతో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రెండు వివాహాలు ఆగిపోయాయి. ఓ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో, మరో ఘటన కదిరి పట్టణంలో జరిగింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో తిరుపతి అనే యువకుడికి గురువారం వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. రెండు కుటుంబాలు పెళ్లికి ఏర్పాట్లు చేసుకోగా, వివాహ ముహూర్తానికి గంటల ముందు వరుడు అదృశ్యం కాగా, రెండు కుటుంబాలూ ఆందోళన చెందుతున్నాయి. వీరు ఫిర్యాదు చేయడంతో, తిరుపతి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. 

ఇటువంటిదే మరో ఘటన కదిరిలో జరిగింది. తనకల్లు మండలానికి చెందిన రఫీ అనే యువకుడికి గురువారం నిఖా జరిపించేందుకు నిర్ణయించారు. ఆడపెళ్లివారు బంగారు ఆభరణాలను నాణ్యమైన బంగారంతో చేయించలేదని మగపెళ్లివారు గొడవకు దిగారు. బుధవారం జరగాల్సిన షుక్రానాకు పెళ్లికొడుకు తరఫున బంధువులు ఎవరూ వెళ్లలేదు. కారణం అడిగితే, పెళ్లికొడుకు కనిపించటంలేదని, తాము కూడా వెతుకుతున్నామన్న సమాధానం వచ్చింది. కనీసం పెళ్లి సమయానికైనా వరుడు వస్తాడని ఎదురుచూసిన అమ్మాయి తరఫువారు, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News