Hyderabad: అదనపు కట్నం కోసం సోదరుడి భార్యకు వేధింపులు.. మహిళా పోలీసుపై కేసు నమోదు

  • అదనపు కట్నం కోసం అత్త, భర్త, ఆడపడుచు వేధింపులు
  • డోమెక్స్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన చంద్రకళ
  • హైదరాబాద్‌లో ఘటన

మహిళా కానిస్టేబుల్‌పై హైదరాబాద్‌లో వరకట్న కేసు నమోదైంది. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శారదానగర్ నివాసి లోకేశ్ బ్యాంకు ఉద్యోగి. అతడి సోదరి నీలవేణి ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 30న శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రకళ (25)తో లోకేశ్‌కు వివాహమైంది. ఈ సందర్భంగా కట్నం కింద రూ. 5 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చారు.

ఈ నెల 25న చంద్రకళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డోమెక్స్‌ను తాగి అస్వస్థతకు గురికావడంతో చంద్రకళను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భర్త, ఆడపడుచు నీలవేణి, అత్త కలిసి అదనపు కట్నం తీసుకురావాలంటూ నిత్యం వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. వారి వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. ఆమె ఫిర్యాదుపై భర్త లోకేశ్‌, కానిస్టేబుల్ నీలవేణితోపాటు ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News