Andhra Pradesh: దమ్ముంటే స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చెయ్.. అదే రోజున ఆమోదం పొందేలా చూస్తా!: బీజేపీ నేత మాణిక్యాలరావుకు ఈలి నాని సవాల్

  • మాణిక్యాలరావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
  • వార్డులో కూడా గెలవని వ్యక్తిని ఎమ్మెల్యే చేశాం
  • ఆయన కోసం నా సీటును త్యాగం చేశాను

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఈలి నాని విమర్శించారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాను స్పీకర్ ఫార్మట్ లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాణిక్యాల రావు ప్రకటించడంపై నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరైనా రాజీనామాను స్పీకర్ కు పంపుతారనీ, కానీ మాణిక్యాల రావు మాత్రం ముఖ్యమంత్రికి పంపుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా ఇవ్వాలనీ, అలా చేస్తే అదే రోజున రాజీనామా ఆమోదం పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాణిక్యాలరావు కోసం తాను టికెట్ ను త్యాగం చేశానని నాని తెలిపారు. ఆయన కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశానని వాపోయారు. వార్డులో కూడా గెలుపొందని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని అన్నారు. తాడేపల్లిగూడెంకు రూ.2,017 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు మాణిక్యాలరావు చెప్పడంపై నాని తీవ్రంగా స్పందించారు. ఇప్పటివరకూ ఎమ్మెల్యేల చరిత్రలో ఓ నియోజకవర్గానికి గరిష్టంగా రూ.800 కోట్లకు మించి వెళ్లలేదని తెలిపారు. నిజంగా రూ.2,017 కోట్లు పెడితే నియోజకవర్గం ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించారు.

More Telugu News