Telangana: కాంగ్రెస్ లో ‘నల్లగొండ’ సీటు లొల్లి.. పోటీలో కోమటిరెడ్డి వర్సెస్ రమేశ్ రెడ్డి!

  • నల్లగొండ సీటుపై కోమటిరెడ్డి కన్ను
  • రాహుల్ గాంధీ ఒకే చెప్పారని వ్యాఖ్య
  • తానే పోటీ చేస్తానంటున్న రమేశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైన నేపథ్యంలో హస్తం నేతలు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే తాను నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాను పార్టీ అధినేత రాహుల్ గాంధీకి చెప్పాననీ, ఆయన సానుకూలంగా స్పందించారని అప్పట్లో వ్యాఖ్యానించారు.

తాజాగా నల్లగొండ పార్లమెంటు స్థానంపై మరో కాంగ్రెస్ నేత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి కన్నేశారు. 2019లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి పోటీ చేస్తానని రమేశ్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 22 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా విజయం సాధించిందని ఆరోపించారు. రాబోయే గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తుందని జోస్యం చెప్పారు.

More Telugu News