2018: 2019లో లాంగ్ వీకెండ్స్ తక్కువే... సెలవులు పెట్టక తప్పని పరిస్థితి!

  • 2018లో 16 లాంగ్ వీకెండ్స్
  • ఈ సంవత్సరం వరుస సెలవులు తక్కువే
  • కనీసం 13 సెలవులు పెట్టుకుంటే 10 లాంగ్ వీకెండ్స్

కనీసం మూడు, అంతకన్నా ఎక్కువ సెలవులు కలిసివచ్చేలా లాంగ్ వీకెండ్స్ 2018లో 16 వచ్చాయి. ఇవన్నీ సెలవుల్లో ప్రయాణాలు పెట్టుకోవడానికి, విహార యాత్రలకు వెళ్లడానికి అవకాశాలను దగ్గర చేశాయి. కానీ, రానున్న కొత్త సంవత్సరంలో వరుస సెలవులు వచ్చే సందర్భాలు తక్కువే. ఉద్యోగులు అదనంగా కనీసం 13 సెలవులు పెట్టుకుంటేనే 10 లాంగ్ వీకెండ్స్ ను అనుభవించే అవకాశాలు ఉన్నాయి.

2019లో ఏప్రిల్, ఆగస్టు నెలల్లోనే అత్యధిక సెలవులు ఉన్నాయి. ఈ నెలల్లోనూ వరుస సెలవులు కావాలనుకుంటే, కొన్ని రోజులు సెలవు పెట్టాల్సిందే. ఇక వచ్చే సంవత్సరం తొలి లాంగ్ వీకెండ్ జనవరి 12 శనివారం నుంచి మొదలవుతుంది. ఆపై ఆదివారం, మకర సంక్రాంతి వరకూ ఉంటుంది. 11 గానీ, 15 గానీ సెలవు పెట్టుకుంటే నాలుగు రోజుల సెలవు లభిస్తుంది.

ఆపై మార్చిలో 2, 3, 4 తేదీలను లాంగ్ వీకెండ్ గా తీసుకోవచ్చు. మహాశివరాత్రి, ఆదివారం కలిసివస్తాయి. ఏప్రిల్ లో 13, 14 (ఆదివారం, శ్రీరామనవమి), 17 (బుధవారం మహావీర్ జయంతి), 19 (శుక్రవారం గుడ్ ఫ్రైడే), 20, 21 (ఆదివారం, ఈస్టర్ సండే) సెలవులుండగా, 18వ తేదీన సెలవు పెట్టుకుంటే, 5 రోజుల వరుస సెలవులు అనుభవించవచ్చు.

ఇక ఆగస్టు విషయానికి వస్తే, 10, 11, 12 తేదీల్లో శని, ఆదివారాలు, బక్రీద్ రానుండగా, 13, 14 సెలవు పెట్టుకుంటే, ఆగస్టు 15 సెలవు కలిసివస్తుంది. ఆపై పెద్దగా కలిసొచ్చేలా సెలవులు లేకపోవడం గమనార్హం. దసరా, దీపావళి పండగలకు సెలవులు పెట్టుకుంటేనే మరిన్ని రోజుల పాటు ప్రయాణాలు పెట్టుకునే సదుపాయం లభిస్తుంది.

More Telugu News