Amaravathi: అమరావతిలో ఏపీ హైకోర్టు.. జనవరి నుంచే కార్యకలాపాలు

  • ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు
  • ఏపీకి 14 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తుల కేటాయింపు
  • సంక్రాంతి నుంచి కేసుల విచారణ

నవ్యాంధ్రకు హైకోర్టు వచ్చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి నూతన హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులుగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రపతి.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా సేవలందిస్తుందని పేర్కొన్నారు.

అలాగే, జనవరి  నుంచి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సేవలందిస్తుందన్నారు. ఉమ్మడి హైకోర్టులో సేవలందిస్తున్న 28 న్యాయమూర్తుల్లో 14 మంది ఏపీకి, పదిమందిని తెలంగాణకు కేటాయించారు. అయితే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీవీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యంలను ఏ హైకోర్టుకు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడుల పేర్లు ఉన్నాయి. అలాగే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఎంచుకున్నట్టు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సంక్రాంతి తర్వాత కేసుల విచారణ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న ఏపీ ఉన్నత న్యాయస్థానం దేశంలో 25వ హైకోర్టు కానుంది.

More Telugu News