singapore: ఏపీలో అభివృద్ధిపై ఎన్ఆర్ఐలు ప్రచారం చేయాలి: సింగపూర్ లో లోకేశ్

  • సింగపూర్ లో లోకేశ్ కు ఘనస్వాగతం
  • ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశంలో పాల్గొన్న లోకేశ్
  • విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ప్రత్యేక ప్రతినిధితో భేటీ

ఏపీలో అభివృద్ధిపై తెలియజెప్పేందుకు ఎన్ఆర్ఐలు అంబాసిడర్లుగా మారి ప్రచారం చేయాలని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ సూచించారు. సింగపూర్ లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉదయం విజయవాడ నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. సింగపూర్ చేరుకున్న లోకేశ్ కు ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ఎన్ఆర్ఐ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎన్ఆర్టీ ఏర్పాటు చేశామని, తెలుగు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.  

కాగా, సింగపూర్ లో పర్యటిస్తున్న లోకేశ్ తన పర్యటన వివరాలను వరుస ట్వీట్ల ద్వారా తెలిపారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో సహకారం అందించేందుకు సింగ‌పూర్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన అంబాసిడర్  గోపీనాథ్ పిళ్ళైతో సమావేశమైనట్టు లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఏపీలో స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించానని, స్టార్టప్ కంపెనీల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. తయారీ, లాజిస్టిక్స్, ఏరో స్పేస్ మరియు నిర్మాణ రంగాల్లో మోడల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ, ఇన్నోవేషన్ కారిడార్ ఏర్పాటుకి సహకారం అందించాలని గోపీనాథ్ ని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

సింగపూర్ వైల్డ్ లైఫ్ రిజర్వ్  సీఈఓని కలిశా

సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ వైల్డ్ లైఫ్ రిజర్వ్ సీఈఓ మైక్ బార్క్లే తో సమావేశమయ్యానని లోకేశ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నిర్వహణ ఉన్న జూలలో సింగపూర్ జూ ఒకటనీ, ప్రతీ సంవత్సరం 1.7 మిలియన్ల ప్రజలు ఈ జూని సందర్శిస్తారని, 315 జాతుల జంతువులు ఇక్కడ ఉన్నాయని మైక్ బార్క్లే తనకు చెప్పినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సమావేశంలో ఆయనకు వివరించినట్టు చెప్పారు. ఏపీలో సింగపూర్ తరహా జూను  ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, దీనికి సహకారం అందించాలని మైక్ బార్క్లేని కోరినట్టు చెప్పారు. 
బిషాన్ -ఆంగ్ మో కియో పార్క్ ను సందర్శించా

ఈరోజు సింగపూర్ లోని బిషాన్ -ఆంగ్ మో కియో పార్క్  ను సందర్శించానని, ఒకప్పుడు వ్యర్థ జలాలతో నిండిన కల్లాంగ్ నదిని శుద్ధి చేసి సహజంగా మార్చడంతో పాటు, పరీవాహక ప్రాంతాన్ని పార్క్ గా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ విషయాలను సింగపూర్ ఏబీసీ వాటర్స్ ప్రతినిధులు తనకు వివరించినట్టు లోకేశ్ పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తాము సింగపూర్ ను మార్చుకుంటున్నామని,  కానీ, అమరావతి విషయంలో ముందుగానే భవిష్యత్తుని అంచనా వేసుకొని పచ్చదనం, డ్రైనెజ్ వ్యవస్థ ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే అవకాశం తమకు ఉందని బిషాన్ -ఆంగ్ మో కి యో పార్క్, ఏబిసి వాటర్స్ ప్రతినిధులు తనతో చెప్పారని తెలిపారు. నూతన రాజధాని అమరావతి అభివృద్ధిలో అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నామని, అలాగే నగరాన్ని కాంక్రీట్ వనంలా కాకుండా సింగపూర్ తరహాలో సహజంగా ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నామని, అమరావతి అభివృద్ధిలో నిరంతర సహకారం కావాలని వారిని కోరినట్టు లోకేశ్ పేర్కొన్నారు.

More Telugu News