Telangana: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ.. ఉమ్మడి హైకోర్టులో మరికొన్ని వ్యాజ్యాలు!

  • తెలుగు మాధ్యమం వారికి ఆంగ్లంలో ప్రశ్నలు
  • ప్రాథమిక ‘కీ’లో 17 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు 
  • దీనిపై హైకోర్టు ఆశ్చర్యం.. 31కి విచారణ వాయిదా
  • నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దన్న హైకోర్ట్ 

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ ఉమ్మడి హైకోర్టులో మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పోస్ట్ లకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దని పునరుద్ఘాటించింది. తెలుగు మాధ్యమంలో పంచాయతీ కార్యదర్శుల ప్రవేశ పరీక్ష రాసిన వారికి ఆంగ్లంలో ప్రశ్నలు వచ్చాయని చెబుతూ ఆయా వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాలను అత్యవసర వ్యాజ్యాలుగా స్వీకరించాలన్న అభ్యర్థనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈరోజు మధ్యాహ్న భోజన విరామ సమయం అనంతరం ఆ వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది. తెలుగు మాధ్యమంలో ప్రవేశపరీక్ష రాసిన వారికి 14 ప్రశ్నలు ఆంగ్లంలో వచ్చాయని, ప్రాథమిక ‘కీ’లో 17 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దకుండానే మార్కులు వేసి ఫలితాలు ప్రకటించారని పిటిషనర్లు పేర్కొన్నారు.

దీంతో, తెలుగు మాధ్యమం వారికి ఆంగ్లంలో ప్రశ్నలు రావడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది దారుణమైన తప్పుగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దివ్యాంగులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించకుండా ఓపెన్ కోటాలో భర్తీ చేశారని మరో పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయంలో సబ్ ఆర్డినేట్ రూల్స్ లోని 22వ నిబంధన ప్రకారమే వ్యవహరిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

పంచాయతీరాజ్ కార్యదర్శుల నియామక ప్రక్రియపై ఇప్పటి వరకు దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై విచారణను ఈ నెల 31వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దని హైకోర్టు పునరుద్ఘాటించింది. 

More Telugu News