USA: ఐఫోన్లు వాడటం మానేయండి.. లేదంటే ఉద్యోగాల నుంచి తీసేస్తాం!: ఉద్యోగులకు చైనా కంపెనీల వార్నింగ్

  • హువావే సీఎఫ్ వోను అరెస్ట్ చేసిన కెనడా
  • అమెరికాకు త్వరలో అప్పగించే అవకాశం
  • అమెరికా వస్తువులను బహిష్కరిస్తున్న చైనా కంపెనీలు

చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ హువావే ఉత్తరకొరియాతో పాటు ఇరాన్ కు కీలక సాంకేతికత అందజేస్తోందని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ వో) మెంగ్‌ వాన్‌జౌను కెనడాలో అధికారులు అరెస్ట్ చేశారు. ఖైదీల అప్పగింత ఒప్పందం మేరకు ఆమెను త్వరలోనే అమెరికాకు తరలించనున్నారు. కాగా, మెంగ్ అరెస్టు వ్యవహారం అమెరికా, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతను రాజేస్తోంది. ఇప్పుడు చైనాలో అమెరికా వస్తువుల బహిష్కరణ సాగుతోంది.

చైనాలో చాలా కంపెనీలు ఐఫోన్లను వాడరాదని తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేస్తున్నాయి. ఒకవేళ ఐఫోన్ వాడితే ఉద్యోగం నుంచి తప్పిస్తామని హెచ్చరిస్తున్నాయి. అలాగే భారీ జరిమానా విధిస్తామనీ, బోనస్ కట్ చేస్తామని బెదిరిస్తున్నాయి. అంతేకాకుండా హువావేకు మద్దతుగా పలు చైనా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగులు ఎవరైనా హువావే ఫోన్లు కొంటే దాని ధరలో 18 శాతం చెల్లిస్తామని షెంజెన్‌ యిడాహెంగ్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

ఇంకో కంపెనీ అయితే మరో అడుగు ముందుకు వేసి ఫోన్ విలువలో 30 శాతం వరకూ మద్యాన్ని ఉద్యోగులకు ఫ్రీగా అందిస్తామని తెలిపింది. తమ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇరాన్, ఉత్తరకొరియాకు కీలక టెక్నాలజీ పరికరాలు విక్రయించినందుకు మెంగ్ ను అరెస్ట్ చేశారు. అమెరికా-కెనడాల మధ్య ఉన్న ఖైదీల బదిలీ ఒప్పందంతో ఇది సాధ్యమయింది.

More Telugu News