Andhra Pradesh: పదేళ్ల వయసులోనే నాన్నను కోల్పోయా.. అన్ని పార్టీల్లోనూ రంగా అభిమానులు ఉన్నారు!: వంగవీటి రాధాకృష్ణ

  • పేదల సంక్షేమం కోసం రంగా కృషిచేశారు
  • ఆయన ఆశయాలను కొడుకుగా నెరవేరుస్తా
  • రాధా చేపట్టిన ర్యాలీలో కనిపించని వైసీపీ జెండాలు

పదేళ్ల వయసులోనే తాను తండ్రిని కోల్పోయానని వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. వంగవీటి మోహనరంగా పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడ్డారని ఆయన అన్నారు. కొడుకుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళతానని పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 30వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. రంగా ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా రంగాకు అభిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారందరిని కాపాడుకుంటూ ముందుకు సాగుతానని రాధాకృష్ణ తెలిపారు. కాటూరులో మూడు ఎకరాలలో రంగా పేరుతో స్మృతి స్థూపం నిర్మిస్తున్నామని వెల్లడించారు.

అయితే ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన ర్యాలీలో వైసీపీ జెండాలు కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. రాధా వైసీపీకి దూరం జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు వైసీపీ అధినేత జగన్ కేటాయించారంటూ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో రాధా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

More Telugu News