BSE: భారీగా పతనమైన క్రూడాయిల్ ధర... మరో ఆర్థికమాంద్యం భయంతో దిగజారిన స్టాక్ మార్కెట్!

  • బ్యారల్ క్రూడాయిల్ ధర 50 డాలర్లకు
  • స్టాక్ మార్కెట్లో నశించిన సెంటిమెంట్
  • పెట్టుబడులు బులియన్ వైపు

క్రిస్మస్ సెలవు తరువాత స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ నశించింది. అమెరికా మార్కెట్ల పతనం తరువాత, తూర్పు ఆసియా దేశాల సూచీలు సైతం నష్టపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు దిగజారాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 50 డాలర్లకు తగ్గడం, ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులు బులియన్ వైపు మళ్లడంతో నష్టం అధికంగా కనిపిస్తోంది. మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా సాగుతోందని నిపుణులు వేస్తున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్న వేళ, అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఈ ఉదయం సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పడిపోయాయి. ఉదయం 11 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే, 342 పాయింట్ల నష్టంతో 35,127 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 94.35 పాయింట్ల నష్టంతో 10,569 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. బీఎస్ఈ-30లో ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, ఐటీసీలు మాత్రమే లాభాల్లో నడుస్తుండగా, మిగతా కంపెనీలన్నీ నష్టపోయాయి. యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలన్నీ నష్టాల్లో సాగుతున్నాయి.

కాగా, బుధవారం నాటి ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.95 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.41 శాతం, హాంగ్ సెంగ్ 0.40 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 0.28 శాతం, కోస్పీ 1.83 శాతం, సెట్ కాంపోజిట్ 0.43 శాతం, జకార్తా కాంపోజిట్ 0.24 శాతం, షాంగై కాంపోజిట్ 0.24 శాతం నష్టపోయాయి. బుధవారం నాడు బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 0.23 శాతం పెరిగి రూ. 31,531కి, కిలో వెండి ధర 0.21 శాతం పెరిగి 37,621కి చేరుకోగా, క్రూడాయిల్ భారత బాస్కెట్ ధర ఏకంగా 2.44 శాతం పడిపోయి 3,002 వద్ద కొనసాగుతోంది.

More Telugu News