Nizamabad District: నిన్న కోరుట్ల, నేడు నిజామాబాద్... తెలంగాణ ఆలయాల్లో కనిపిస్తున్న వింత పక్షులు!

  • జక్రాన్ పల్లి సమీపంలో శివాలయం
  • లింగం ముందు ప్రత్యక్షమైన వింతపక్షి
  • పూజలు చేస్తున్న భక్తులు

తెలంగాణలోని దేవాలయాల్లో వింత పక్షులు దర్శనమిస్తుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని విగ్రహం వద్ద ఓ గరుడపక్షి చాలాసేపు నిలబడిపోగా, భక్తులు దీన్ని దేవుని మహిమగా భావిస్తూ, ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.

 తాజాగా, నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, కేసుపల్లి శివాలయంలో పిచుకను పోలిన వింతపక్షి ఒకటి, శివలింగం ముందు తిరుగుతూ, అక్కడి నుంచి కదలకపోవడం కెమెరాలకు చిక్కింది. ఈ పక్షి కూడా కోరుట్లలో కనిపించిన గరుడపక్షిని పోలినట్టుగానే ఉండటం గమనార్హం. మిర్యాలగూడ సమీపంలోని ఓ ఆలయం గర్భగుడిలోకి కూడా ఓ పక్షి వెళ్లగా, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. ఇవి మహాత్మ్యం గల పక్షులని నమ్ముతున్న భక్తులు, వాటికి కూడా పూజలు ప్రారంభించారు.

కాగా, కోరుట్లలో దర్శనమిచ్చిన గరుడపక్షి ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల సంరక్షణలో ఉండగా, జక్రాన్ పల్లి ఆలయంలోని పక్షి విషయాన్ని అధికారులకు చేరవేశారు స్థానికులు.

More Telugu News